శ్రీశైలం ప్రాజెక్టుకు రెండోసారి వరద వచ్చినా... రాయలసీమ ప్రాజెక్టులకు నీరు నింపటంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. కమలాపురంలోని సర్వరాయసాగర్ను సీపీఐ బృందం పరిశీలించింది. ఇప్పటివరకు గండికోట ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరు నిల్వ చేయలేకపోతున్నారని... పైడిపాళెం, తెలుగుగంగ, వామికొండ జలాశయాలు నీటితో కళకళలాడాల్సినవి... వెలవెల బోతున్నాయని విమర్శించారు. గండికోట నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచడం లేదన్నారు. వామికొండ జలాశయానికి వస్తున్న నీటిని నిలిపేసి వంకల ద్వారా వృథా చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:నేడు గవర్నర్ను కలవనున్న తెదేపా బృందం