కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన హుస్సేన్ (కారు డ్రైవర్), అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శ్రీనివాసులు, అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ ప్రమాదానికి గురయ్యారు. కడప నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు ముందు భాగంలో వెళ్తున్న లారీని క్రాస్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే రామాపురం, లక్కిరెడ్డిపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.