శుభకార్యంతో పాటు శాఖాపరంగా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసేందుకు పులివెందులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, ఆయన సతీమణి నళినీదేవి మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం పీడీని హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఇరుక్కుపోయి వారిని బయటికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా... మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు రామ్మోహన్‌రెడ్డి సొంతూరు వైయస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలం ఆవులవాండ్లపల్లె. రామాపురం మండలం కొండవాండ్లపల్లెకు చెందిన నళినిదేవి(43)ని 15 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. నళినిదేవి అన్నమయ్య జిల్లా పీలేరులోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె అక్కడే ఉంటూ, అప్పుడప్పుడు కడపకు వస్తూ వెళ్లేవారు. వీరికి ఉదయకుమార్‌రెడ్డి(13) మహిజా(11) ఇద్దరు పిల్లలున్నారు. కడప నగరంలో నెహ్రూపార్కు సమీపంలో నివాసం ఉంటున్నారు. పులివెందులలో తెలిసిన వారి వివాహం ఉండడం, అక్కడే మెప్మా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసేందుకు బుధవారం పీడీ రామ్మోహన్‌రెడ్డి, అతని భార్య నళినిదేవి, మెప్మా సీవో సుబ్బారెడ్డి, ఏవో రమేష్‌కుమార్‌రెడ్డి కారులో పులివెందులకు బయలుదేరారు. సీకేదిన్నె మండల సమీపంలోని వైయస్‌ఆర్ విగ్రహం నుంచి రింగ్ రోడ్డు మీదుగా వెళ్తూ ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసేందుకు యత్నించారు. లారీ డ్రైవర్ పక్కకు వెళ్లకుండా కారువస్తున్న వైపే తిప్పడంతో కారు వంతెన రక్షణ గోడకు లారీకి మధ్యలో ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న అయిదుగురు అందులో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఎస్సై అరుణ్‌రెడ్డి సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. వారిని బయటికి తీసేందుకు వీలుకాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. అగ్నిమాపక సిబ్బంది తమ వద్ద ఉన్న అత్యాధునిక పరికరాలతో కారును కట్ చేసి అందులో ఉన్న వారిని బయటికి తీశారు. డ్రైవర్ వెంకటరమణరెడ్డి కాలు ఇరుక్కుపోవడంతో అతన్ని బయటికి తీసేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది. నిళినీదేవిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. రామ్మోహన్‌రెడ్డి తల్లి సుబ్బలక్షుమ్మ కోడలు మృతిచెందడం, కొడుకుకు తీవ్రగాయాలు కావడం చూసి బోరున విలపించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్ నళినీదేవి మృతికి నివాళి అర్పించారు. గాయపడిన వారిని పరామర్శించారు. మెప్మా సిబ్బంది పలువురు ఆసుపత్రికి చేరుకుని కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్సై అరుణ్‌రెడ్డి తెలిపారు. భార్య మృతిచెందిన విషయం ఇప్పటికీ పీడీకి తెలియజేయలేదు. తన భార్యతో మాట్లాడాలని రెండు సార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు.
మేడంతో మాట్లాడించండి.. ప్లీజ్ : హరి ఒక్కసారి మేడంతో వాట్సప్ కాల్ చేయించవా ప్లీజ్.. నాకు బాగానే ఉంది. ఆమె నా గురించి భయపడుతుంటుంది. ఆమెకు నేను ధైర్యం చెప్పి, నాలుగు మాటలు మాట్లాడతాను. కాల్ చేయించవా అని ఏపీఎం హరిని పీడీ రామమోహన్‌రెడ్డి అడగడం చూసి అక్కడున్నవారు కంటతడిపెట్టారు. ఉబికి వస్తున్నా కంటినీరును అపుకొని సార్.. మేడమ్‌కు ఏమి కాదు మేమున్నాం. ఆమె ఆసుపత్రిలో ఉంది. వైద్యులు వైద్యం చేయిస్తున్నారు. మాతో మేడం మాట్లాడారు. మనోళ్లందరం ఇక్కడే ఉన్నాం. మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదంటూ చెబుతున్నారు. హైదరాబాద్ చేరుకునే లోపే ఇలా రెండు మూడు సార్లు వీడియోకాల్ చేయించాలని పీడీ కోరారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిన పీడీకి వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రాణాపాయం లేదని చెప్పినట్లు సమాచారం. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది.
మార్చురీలోనే మృతదేహం : సర్వజన ఆసుపత్రి మార్చురీలో నళినీదేవి మృతదేహం ఉంది. గురువారం పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. పీడీ సొంత ఊరైనా చక్రాయపేట మండలం చిలేకంపల్లె గ్రామం ఆవులవాండ్లపల్లెలో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. పీడీకి శస్త్రచికిత్స రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యేట్లు ఉంటే ఆయన్ను తీసుకొచ్చి అంత్యక్రియల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్న బంధువులు పేర్కొంటున్నారు. ఆయన లేకుండా దహన సంస్కారాలు చేయలేమని చెబుతున్నారు.