కడప జిల్లా మైదుకూరులో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకంతో పట్టణంలో ర్యాలీతీశారు. జై భారత్, జైజై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోలీసు మైదానంలో...
72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప పోలీసు మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల నృత్యాలు, కర్రసాము అందరినీ అలరించాయి. అనంతరం కడప అగ్నిమాపక శాఖ వారు నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పివేయాలో అగ్నిమాపక సిబ్బంది చేసి చూపించారు. విద్యుత్, గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపక వాహనం నుంచి విడుదల చేసిన జాతీయ పతాకాల రంగులు గల నీరు అందరిని ఆశ్చర్యపరిచింది.
రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో...
సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని ఆర్థిక అభివృద్ధి, శాంతి వైపు అడుగులు వేయాలని సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ప్రజలకు సూచించారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని సబ్ కలెక్టర్ ఎగురవేసి వందనం చేశారు. విద్యార్థులు పెరేడ్ నిర్వహించారు. దేశభక్తి గేయాలు. నృత్యాలతో అలరించారు. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు.
రాజంపేటలో
రాజంపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు క్షీరాభిషేకం చేశారు. ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉందన్నారు.
ఇదీ చదవండి: ఆర్కిటెక్చర్ వర్సిటీలో కోర్సుల ప్రారంభానికి సన్నాహాలు