కడపజిల్లా యర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో ఉన్న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విస్తరణపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పాల్గొన్నారు.
స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజలు అధికారులను కోరారు. తగిన అర్హత, నైపుణ్యం కలిగిన వారికి యాజమాన్యం ప్రాధాన్యతనివ్వాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విస్తరణ చేసిన ప్రాంతంలో పాఠశాల వసతి మెరుగుపరచాలని అభ్యర్థించారు. ఈ అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ప్రాజెక్ట్ విస్తరణ చేపడతామని సిమెంట్ కంపెనీ యాజమాన్యం వారు ప్రజలకు వివరించారు.
ఫ్యాక్టరీ విస్తరణ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని జిల్లా ఉప పాలనాధికారి అన్నారు. ప్లాంట్ విస్తరణను స్వాగతించడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు, చిలమకూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎన్జీవోలు, పర్యావరణ మానవ హక్కుల కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం అనుబంధ సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అవినీతి లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం