Rains in AP: ఏపీలో పలుచోట్ల కురిసిన కుండపోత వర్షాలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. రహదారులను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు కుందూనది పరవళ్లు తొక్కుతోంది. రాజోలి ఆనకట్ట వద్ద నదీప్రవాహం 33 వేల క్యూసెక్కులకు పెరిగింది. చాపాడు మండలంలోని సీతారామపురం వద్ద వంతెన అంచులను తాకుతూ నదిలో నీరు ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు చిదానందం సగిలేరు జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయం ఐదు గేట్లకు అధికారులు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
Heavy Rains in Visakha: విశాఖలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
అదే సమయంలో వరదనీరు వచ్చి చేరడంతో రెండు గేట్లు ఎత్తి దిగువన ఉన్న కమలకూరు ఆనకట్టకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వానలతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముద్దనూరు మండలం ఓబులాపురం వద్ద ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
Rain Alert in AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
వైయస్సార్ జిల్లా చెన్నూరు మండలంలోని పెన్నా నదిలో వరద ప్రవాహంలో చిక్కుకున్న నలుగురు యువకులను అగ్నిమాపక, పోలీస్ శాఖ సిబ్బంది కాపాడారు. చెన్నూరు కు చెందిన 10 మంది యువకులు నిన్న సరదాగా పెన్నానదిలోకి వెళ్లారు. ఎడతెరిపి లేని వర్షాలకు వరద నీరు ఒక్కసారిగా నదిలోకి చేరడంతో ఆరుగురు యువకులు అక్కడి నుంచి అతి కష్టం మీద ఈదుకుంటూ బయటికి వచ్చారు. మిగిలిన వారు చరవాణి ద్వారా సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. కడప అగ్నిమాపక శాఖ సిబ్బంది బోటు సహాయంతో నదిలోకి వెళ్లి నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరద ఉద్ధృతి అధికంగా ఉన్నా ప్రాణాలకు తెగించి యువకులను రక్షించిన అగ్నిమాపక సిబ్బందిని అధికారులు అభినందించారు.
Heavy Rains: రానున్న 24గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రస్తుత వానలు వరి పంటకు ఊపిరి పోస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, అద్దంకి, మార్టూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం కురవటంతో ఉపశమనం పొందారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎత్తిపోతల జలపాతం వరద నీటిలో జలకళను సంతరించుకుంది. జలపాతం అందాలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.