కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. జమ్మలమడుగు ఆర్డీవో వద్ద పోలీసులు బైండోవర్ చేయించారు. అంతకుముందు.. ఇవాళ ఉదయం మణికంఠ రెడ్డిని పులివెందుల పోలీసులు విచారణ చేశారు. తన ఇంట్లో రెక్కీ చేశాడని.. తమకు ప్రాణహాని ఉందని... వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 10న తమ ఇంటి వద్ద మణికంఠ రెక్కీ నిర్వహించాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
నిన్నటి పరిణామాలు...
తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. వెంటనే భద్రత కల్పించాలని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత నిన్న కడప ఎస్పీ కార్యాలయంలో లేఖ అందజేశారు. లేఖతో పాటు తమ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన దృశ్యాలతో కూడిన పెన్‌డ్రైవ్ అందజేశారు. డీఐజీ, డీజీపీలకు కూడా లేఖ పంపించారు.
ఈ నెల పదోతేదీన కడప జిల్లా పులివెందులలోని మా ఇంటివద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడు. ఇతడు మా తండ్రి హత్యకేసులో అనుమానితుడు, వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పులివెందులలో మణికంఠరెడ్డి చిత్రాలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అతడు మా ఇంటిదగ్గర రెక్కీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించి ఇతడే ఆ ఫ్లెక్సీల్లోని వ్యక్తిగా నిర్ధారణకు వచ్చాను. దీనిపై పులివెందుల సీఐ భాస్కరరెడ్డికి ఈ నెల 12న సమాచారం అందించాను. ఆయన మా ఇంటికి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, పనివారిని విచారించారు. -వివేకా కుమార్తె సునీత
ఈ పరిణామాలపై విచారణ చేసిన పోలీసులు.. నేడు మణికంఠరెడ్డిపై బైండోవర్ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
నెల్లూరు జిల్లాలో విషాదం..ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య