Pulivendula Fish Hub: గతేడాది డిసెంబరు 24న పులివెందుల సభలో సీఎం చిరునవ్వులు చిందిస్తూ ఆర్భాటంగా అన్న మాటలివి. పులివెందులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకూ..ఫ్రెష్‌గా ఉండే చేపలు, రొయ్యలూ అమ్మేందుకు ఆక్వాహబ్ పెడుతున్నామంటూ.. నొక్కినొక్కి చెప్పారు. ఇప్పుడా ఫ్రెష్‌గా ఉండే సంగతి పక్కనబెడితే.. సీఎం మాటలతో దీమాతో ఉన్నవారు మాత్రం ఉక్కపోతతో ఉలిక్కిపడుతున్నారు.
బహుషా చేపలు, రొయ్యలు విక్రయించే షాపు పులివెందులకు వస్తుందని ఏనాడూ ఊహించలేదన్న సీఎం మాటలు.. వాస్తవరూపం దాలుస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రా ఆక్వాహబ్ పేరుతో నిర్మించిన ఫిష్‌హబ్.. రెణ్నెళ్లుగా మూతపడే ఉంది. పులివెందులలో.. దాదాపు కోటి రూపాయలతో ప్రైవేటు వ్యక్తులు ఆక్వాహబ్ ఏర్పాటు చేసినా.. మూన్నాళ్ల ముచ్చటగానే మారింది.
కాకినాడ, విజయవాడ, విశాఖతోపాటు.. వివిధ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో పెంచుతున్న చేపలను తీసుకొచ్చి..ఈ హబ్‌లో నిల్వ చేయాల్సి ఉంది. చేపలు 3, 4 రోజుల పాటు తాజాగా ఉండేలా ఐస్ యంత్రాలను తీసుకొచ్చినా.. ప్రారంభంలోనే మొరాయించాయి. రూ.30 నుంచి 40 లక్షలకు పైగా విలువైన యంత్రాలను సమకూర్చినా.. పనిచేయలేదు. ఫలితంగా సీఎం. చెప్పినట్లుగా.. చేపలు, రొయ్యల్ని ఫ్రెష్‌గా నిల్వ చేసుకునేందుకు అవకాశమే లేకపోయింది.
ఆక్వాహబ్‌పై నిర్వాహకులూ పెద్దగా సరైన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలూ ఉన్నాయి. దానికితోడు.. ఐస్ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల.. వివిధ యంత్రాలకు విద్యుత్ బిల్లులు తడిసి మోపడయ్యాయి. లక్ష రూపాయలకుపైనే ఉన్న బకాయిల వల్ల.. అధికారులు కనెక్షన్ తొలగించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే...పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఆక్వాహబ్ మూత పడటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐస్ యంత్రాలు చెడిపోవడం, విద్యుత్ బకాయిలతో ఇబ్బందులూ వాస్తవమేనని.. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు స్పష్టం చేశారు. సమస్య పరిష్కరించి.. త్వరలో హబ్ తెరుచుకొనేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అయితే.. పులివెందుల తరహాలోనే రాష్ట్రంలో 70 వరకు ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తామంటూ.. సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో 14వేలవరకు రిటైల్ దుకాణాల ఏర్పాటుతో.. చేపలు, రొయ్యలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. సొంత నియోజకవర్గంలోనే మూతపడటంతో.. అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్వాహకులకు బ్యాంకుల నుంచి రుణం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలుకావడం లేదు.
చనిపోయిన చేపల విక్రయం: ఇటీవల మూతపడిన దుకాణం ద్వారాలను మంగళవారం తెరిచారు. చనిపోయిన చేపలను విక్రయానికి పెట్టి అభాసుపాలయ్యారు. చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండటం, చేపలు బాగా పెరగడంతో ఆక్వాహబ్‌కు పెద్దగా స్పందన రాలేదు. దీని నిర్వహణ భారంగా మారింది. చివరకు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేకపోయారు. దీంతో ఎస్పీడీసీఎల్ ఫిబ్రవరి 10న విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో వెంటనే ఆక్వాహబ్ మూతపడింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో నిర్వాహకులు మంగళవారం దుకాణాన్ని తెరిచారు. స్థానికంగా ఉన్న పార్లపల్లె డ్యాంలో లభిస్తున్న చేపలను తీసుకొచ్చి విక్రయానికి ఉంచారు. ఎండ వేడికి చేపలు చనిపోయాయి. హబ్‌కు వినియోగదారులు ఎవరూ రాలేదు. పునరుద్ధరించిన తొలిరోజు ఇలా ముగిసింది.
రూపాయి కూడా చెల్లించలేదు.. ఆక్వాహబ్ ప్రారంభం నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించలేదు. వీరికి రాయితీలివ్వాలనే ఆదేశాల్లేవు. బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేశాం. బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తాం. - జగదీశ్వర్‌రెడ్డి, ఏఈ, ఎస్పీడీసీఎల్
ఇదీ చదవండి:
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యంగా వెళ్లినా అనుమతి