New Districts in AP :
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నిరసన జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని, ఆయా జిల్లాల్లో తమ నియోజకవర్గాలను కలపకూడదంటూ.. తెరమీదకు కొత్త డిమాండ్లు వస్తున్నాయి. రెవెన్యూ డివిజన్ల విషయాన్నీ కొందరు ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. విద్యార్థులు సైతం నిరసనల్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఆందోళనలు మిన్నంటాయి. మరోవైపు రైల్వేకోడూరులోనూ నిరసనలు జరిగాయి. పోలీసు ఆంక్షలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మదనపల్లె జిల్లా కోసం మొదలైన ఉద్యమం ఉద్రిక్తరూపం దాల్చింది. ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని జిల్లా సాధన జేఏసీ నేతలు ముట్టడించారు. పోలీసులు వీరిని అరెస్టుచేశారు. తెదేపా, కాంగ్రెస్, జనసేన, మాలమహానాడు, సీపీఐ నాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరాన్ని కాక నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ.. శుక్రవారం పట్టణ బంద్ పాటించారు. పాత కర్నూలు జిల్లాలో కొత్తగా ఆదోని జిల్లాను ఏర్పాటుచేయాలంటూ రాస్తారోకోలు చేశారు. పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 250 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అందువల్ల రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని తూర్పుగోదావరి మన్యంలో ఆందోళనలు చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాకు తిరుపతి పేరునే ఖరారు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ డిమాండు చేశారు.
అధికార పార్టీ నుంచీ...
అధికార పార్టీ నుంచి కూడా కొన్ని సమస్యలను ప్రస్తావించారు. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో శుక్రవారం చర్చావేదిక ఏర్పాటైంది. శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఏర్పేడు మండలాన్ని.. తిరుపతి డివిజన్‌లోనే ఉంచాలని మండల ప్రజాపరిషత్ సమావేశంలో వైకాపా ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంగా పిడుగురాళ్లను ప్రకటించాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరగా, నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు అక్కడి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
రాజంపేటలో పెల్లుబికిన నిరసనలు
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ శుక్రవారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. రైల్వేకోడూరులోనూ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. రాజంపేటనే... అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రైల్వేకోడూరులో విద్యార్థులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆంక్షలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఎంపిక చేయాలంటూ పురపాలక సంఘం ప్రత్యేక తీర్మానం చేసినట్లు ఛైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తీర్మానాన్ని ముఖ్యమంత్రికి పంపినట్లు చెప్పారు. తమ డిమాండును ఆమోదించకపోతే రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని వైస్‌ఛైర్మన్ మర్రి రవి డిమాండు చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే.. రైల్వేకోడూరును బాలాజీ జిల్లాలో కలపాలని వైకాపా విద్యార్థి నేత బండారు మల్లికార్జున అన్నారు.
ప్రజల మనోభావాలను గౌరవిస్తాం: శ్రీకాంత్‌రెడ్డి
జిల్లా కేంద్రంగా రాజంపేట ప్రకటించాలన్న అక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా విభజన విషయంలో స్థానికంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘సరిహద్దులను నిర్ణయించడానికి 30 రోజుల గడువు ఉంది. కమిటీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం. వివాదాలను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్లానింగ్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు.
మదనపల్లె జిల్లా సాధన ఉద్యమం ఉద్రిక్తం
మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తమైంది. శుక్రవారం మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా, కాంగ్రెస్, జనసేన, జిల్లా సాధన కమిటీ నాయకులు పలువురు ఎంపీ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మాలమహానాడు, సీపీఐ నాయకులనూ అడ్డుకోవడంతో నిరసన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. టమాటా మార్కెట్ ఎదుట రైతులు, హమాలీలు, ఆటో డ్రైవర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని అర్హతలున్నాయని తెదేపా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ గౌతంకుమార్ అన్నారు.
ఆదోని జిల్లా కోరుతూ రాస్తారోకో
ఆదోని జిల్లా డిమాండు ఊపందుకుంటోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం తెదేపా, ప్రజాసంఘాల నేతలు తమ డిమాండును పునరుద్ఘాటించారు. పీడీఎస్‌యూ, డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదోని భీమాస్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఎమ్మిగనూరులో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
రంపచోడవరం జిల్లా కావాలని ఆందోళన
పాడేరు కేంద్రంగా ఏర్పడే జిల్లాతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తూర్పుగోదావరి మన్యం వాసులు అంటున్నారు. పాడేరు జిల్లాను రద్దు చేసి, రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని మన్యంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి, వైకాపా మండల కన్వీనర్ రామన్నదొర ఆధ్వర్యంలో సర్పంచి బొజ్జయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఎటపాక నుంచి పాడేరుకు 350 నుంచి 400 కి.మీ., రంపచోడవరం నుంచి 250 నుంచి 300 కి.మీ. దూరం ఉంటుందన్నారు. ర్యాలీగా వెళ్లి ఐటీడీఏ ఏపీవో నాయుడికి వినతిపత్రం అందజేశారు.
నరసాపురం బంద్ ప్రశాంతం
కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లాకు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం నరసాపురం పట్టణంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఐకాస నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
నేడు హిందూపురం బంద్
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి