మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. పులివెందులలోని సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సునీత లేఖలోని ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అంతకుముందు...
తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఈ మధ్యాహ్నం లేఖ రాశారు. వెంటనే భద్రత కల్పించాలని కోరారు. ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడని లేఖలో వెల్లడించారు. మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడుగా సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు రెక్కీ నిర్వహించటం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా అనుమానితుడిని గుర్తించామని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు పంపారు.
ఇదీ చదవండి:
Letter: మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ