కడప జిల్లా సుండుపల్లి మండలం, చిత్తూరు జిల్లా కె.వి పల్లి, ఎర్రవారిపాలెం మండలాల పరిధిలోని నీటి వనరుల్లో వర్షపు నీరు చేరడంతో దిగువన ఉన్న పించ ప్రాజెక్ట్ వరద నీటితో నిండింది. మూడేళ్లుగా చుక్క నీరు లేక ఒట్టిపోయిన ప్రాజెక్టు... ఒక్కసారిగా నీటితో కళకళలాడటంతో ఆ ప్రాంత రైతులలో ఆనందం నెలకొంది. రబీ కింద పంట సాగు చేస్తున్న వారిలో ఆశలు మొలకెత్తాయి.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు గేట్లకు రెండు కోట్ల 75 లక్షలు నిధులు మంజూరు చేయటంతో తుప్పు పట్టిన గేట్లను మార్చారు. ఈ మధ్యే పనులు పూర్తైనందున ప్రాజెక్టు నుంచి వృథా అవుతున్న నీటిని అరికట్ట గలిగారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ముందస్తుగా గేటు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టుకు నీరు చేరుతుంది. ప్రాజెక్టు కింద మూడుం పాడు, రాయవరం, పించా ప్రాంతాలలో సుమారు 12 వేల ఎకరాలలో పంటల సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ఉద్యాన తోటలకు ఈ వర్షం ఊపిరి పోసింది. కరవు నేలలో జలకళ సంతరించుకోవటం చూసి ఆప్రాంత కర్షకులు ఆనందపడుతున్నారు.
ఇదీ చదవండి