DALMIA CEMENTS: వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మెర్ల గ్రామ సమీపంలో 13 ఏళ్ల క్రితం దాల్మియా సిమెంట్ కర్మాగారాన్ని నిర్మించారు. వంకలు వాగులను లెక్క చేయకుండా.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాలకు సమస్యలు తలెత్తాయి. ఏటా వర్షాకాలంలో వరద నీరు దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్ని ముంచెత్తుతోంది. సుమారు 13వందల ఎకరాలు నీటమునుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. సమస్యను దాల్మియా యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
కర్మాగారం కోసం గ్రామానికి సమీపంలో ఇష్టానుసారం క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇళ్లన్నీ నెర్రలు చీలి ప్రమాదకరంగా మారాయి. కష్టకాలంలో కనీసం ఉపాధి కూడా చూపించడం లేదని మహిళలు వాపోతున్నారు. మాజీమంత్రి, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డికి 2 గ్రామాల ప్రజలు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇటీవలే జమ్మలమడుగు ఆర్డీవోను కలిసి.. సమస్యను వివరించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. దాల్మియా సిమెంటు కర్మాగారం వల్ల 2గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలపై.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు ఆర్డీవో చెబుతున్నారు.
ఇవీ చదవండి: