Tummalapalle Uranium Mine: తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ వాతావరణాన్ని విషతుల్యం చేస్తోందంటూ ఆగమేఘాలపై మూసివేత ఉత్తర్వులిచ్చింది జగన్ ప్రభుత్వం. కానీ, పులివెందుల నియోజకవర్గ ప్రజల కాలుష్యవేదన మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది. వైఎస్సార్ జిల్లా ఎమ్ తుమ్మలపల్లెలోని యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు నిల్వచేసే చెరువులోని కాలుష్యకారకాలు భూగర్భంలోకి ఇంకడం వల్ల.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానిక ప్రజలు అనేకసార్లు ఆందోళనలు చేశారు. చర్మవ్యాధులు చుట్టుముడుతున్నాయని, కీళ్ల నొప్పులు, గర్భ విచ్ఛిత్తి వంటి సమస్యలతో సతమతం అవుతున్నామని ఆందోళనచెందుతున్నారు.
ప్రజల ఫిర్యాదులతో కాలుష్య నియంత్రణ మండలి మద్రాసు ఐఐటీతో అధ్యయనం చేయించింది. యూరేనియం వ్యర్థాలను చెరువులో నిల్వచేయటం వల్ల భూగర్భ జలకాలుష్యం జరిగిందనటానికి ఎలాంటి రుజువు లేదని ఆ నివేదిక తేల్చేసింది. ఐతే.. ఆ నివేదికలో శాస్త్రీయత లేదని, అధ్యయనానికి వారు అనుసరించిన పద్ధతి శాస్త్రీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని మానవహక్కుల వేదిక మండిపడింది. మద్రాసు ఐఐటీ నివేదికలోని అంశాలపై ఐదుగురు శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపించి.. అందులోని డొల్లతనాన్ని బహిర్గతపరిచారు శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి బాబూరావు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాలుష్య నియంత్రణా మండలి కూడా యురేనియం కర్మగారానికి అనుకూలంగా వ్యవహరించి.. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టాయని.. బాబూరావు ఆరోపించారు.
"సరైన అధ్యయనం చేయకుండా, ప్రజల కష్టాలను గమనించకుండా.. అసలు చెరువు నుంచి వ్యర్థాలు భూమిలోనే ఇంకటం లేదని నివేదిక ఇచ్చారు. అక్కడి నుంచి ఏమి ఇంకటం లేదని చెప్పటంలోనే ఐఐటీ మద్రాసు తప్పు ఉంది."-బాబూరావు, శాస్త్రవేత్త
యురేనియం కర్మాగారం వల్ల ఏర్పడుతున్న కాలుష్య ప్రభావం కొన్ని వందల ఏళ్లు ఉంటుందని ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెనువిపత్తుగా మారే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేయిస్తున్న అధ్యయనాల్లో మూలాలు గుర్తించే దిశగా చర్యలు ఎందుకు ఉండట్లేదో అర్థం కావడం లేదు. యురేనియం కర్మాగారం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయన్న అపోహ ఉంటంతో.. ఇక్కడ యువతను ఝార్ఖండ్‌లోని జాదుగూడ యురేనియం కర్మాగారానికి తీసుకెళ్లి వారి అనుమానాలన్నీ నివృత్తి చేసినట్లు కర్మాగారం శంకుస్థాపన సందర్భంగా నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. నిజంగానే సమస్య లేకపోతే ఇప్పుడు ప్రజలు ఎందుకు ఆ కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారో తెలియదు.
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తోంది. అయినా యురేనియం కర్మాగారంపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. భూగర్భాన్ని కలుషితం చేస్తున్న యురేనియం శుద్ధి కర్మాగారంపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ.. 2019 ఆగస్టు 7న ఆ కర్మాగారానికి నోటీసులు అందాయి. కానీ, కర్మాగారం మూసివేతకు ఇప్పటిదాకా ఎందుకు చర్యలు చేపట్టలేదో చెప్పాలంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకకుండా చెరువు అడుగు భాగంలో 250 మైక్రాన్ల మందంతో పాలీయాథిలిన్ పొర ఏర్పాటుచేయాలని కాలుష్య నియంత్రణ మండలి గతంలో నోటీసులిచ్చింది. కానీ నేటికీ అతీగతీ లేదు.
ఇవీ చదవండి :