Attack on Sarpanch : తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని వైసీపీ సర్పంచ్ సౌజన్య కుమార్ రెడ్డి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైయస్సార్ కడప జిల్లాలో వీరపనాయునిపల్లె మండలం యర్రమంపల్లె గ్రామానికి చెందిన చైతన్య రెడ్డి కుటుంబంపై అధికార పార్టీకి చెందినవారే దాడికి పాల్పడ్డారు. గాయపడిన ప్రస్తుత సర్పంచ్ సౌజన్యకుమార్ రెడ్డి అన్న చైతన్య రెడ్డికి గాయాలు కావడంతో కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంతవరకు కేసు నమోదు చేయలేదని వారు వాపోతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడానికి కారణం.. ఇరు వర్గాలు అధికార పార్టీకి చెందినవారే కావడమని తెలుస్తోంది. అందుకే కేసులు పెట్టడానికి ఆలోచిస్తున్నారని చైతన్య రెడ్డి అన్నారు. దాదాపు 16 సంవత్సరాల క్రితం తన తండ్రి సర్పంచ్‌గా ఉన్న సమయంలో.. అభివృద్ధి చేస్తున్నారని ఓర్వలేక హతమార్చిన ప్రత్యర్థులు.. మళ్లీ అదే తరహాలో సర్పంచ్‌గా ఉన్న మా కుటుంబంపై మారణాయుధాలతో దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
పాత కక్షలతోనే తమ కుటుంబంపై దాడి చేయడానికి వచ్చారని.. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే.. ఎందుకు కేసు నమోదు చేయలేదో తమకు అర్థం కావడం లేదవని చైతన్య రెడ్డి అంటున్నారు. కేసు నమోదు చేయాలని వీరపనాయునిపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. మూడు రోజుల నుండి ఇంతవరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన చెందారు. తాము ఇంటి వద్దకు, పంట పొలం వద్దకు ఒంటరిగా వెళ్లాలంటేభయంగా ఉందంటూ మీడియాకు వెల్లడించారు.
ఇప్పటికైనా పోలీసులు కేసు నమోదు చేసి.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చైతన్య రెడ్డి కోరాడు. తమ కుటుంబంపై దాడి జరిగినప్పుడు తన సోదరుడు కూడా ఇంటి వద్ద లేడని.. ఎవరూ లేని సమయంలో వారు మారణాయుధాలతో దాడికి వచ్చారని తెలిపారు. పాత కక్షలు ఏవీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని గ్రామ ప్రజలు.. తమను ఎన్నుకోవడం సంతోషమని.. అందుకు తగినట్లే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తాము ముందుకు పోతున్నామన్నారు.. అది చూడలేక గతంలో తన తండ్రిపై.. ఇప్పుడు మా కుటుంబంపై దాడికి దిగుతున్నారని సర్పంచ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: