Kodandaramaswamy pushpayagam: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగం వైభవంగా జరిగింది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఇందులో తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, మొగలి తదితర 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు 2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. కోదండ రాముని బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలంలోని శ్రీ శ్రీ శ్రీ తులసమ్మ అమ్మవారి వార్షిక సంబర మహోత్సవాలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి. ఆదివారం వేకువజాము నుండి ప్రారంభమైన పూజలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఇచ్చాపురం, పరిసర గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల అమ్మవారి భక్తులు కూడా.. అమ్మవారిని దర్శించుకుని మోక్కులు చెల్లించుకున్నారు. ఏడాదికొకసారి వచ్చే సంబరం మహోత్సవం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాంతో ఆలయ ప్రాంగణం, పాత జాతీయ రహదారి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో వస్తున్న భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని సంబరాల నిర్వహణ కమిటీ నిర్వహించింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలను.. ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. సందర్శకుల వినోదం కోసం ఎగ్జిబిషన్స్, ఇతర స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. అనకాపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమంలో కాషాయ వస్త్రధారణ ధరించిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమంతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట నృత్యం, కర్ర సాము, విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదంతో అనకాపల్లి మార్మోగింది.
ఇవీ చదవండి: