అంధకారంలో అంగన్వాడీ కేంద్రాలు కడప జిల్లా ప్రొద్దుటూరులోని అంగన్వాడీ కేంద్రాల్లో అసౌకర్యాలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. గాలి, వెలుతురు సరిగా లేని భవనాల్లో సేవలు పొందుతున్నారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో మొత్తం 3621 కేంద్రాలున్నాయి. వాటిలో 1.80 లక్షల మంది బాలలు, 39 వేల మంది గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అన్నీ కేంద్రాలకు దాదాపుగా విద్యుత్ సౌకర్యం లేదు. సొంత కట్టడాల్లోనూ అదే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2017 సెప్టెంబరులోనే అప్పటి జిల్లా కలెక్టరు బాబూరావు ఒక్కో కేంద్రానికి 1200 రూపాయలు చొప్పున నిధులు విడుదల చేసి 1699 కేంద్రాలకు మీటర్లు ఏర్పాటు చేయించారు. ప్రొద్దుటూరు పరిధిలో 118 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. అయితే ప్రతి నెలా వచ్చే బిల్లు ఎవరు చెల్లించాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బిల్లులు చెల్లించలేదని కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఆ శాఖ సిబ్బంది.
మౌలిక సదుపాయాలు కరవు
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా నిలిచిపోయి విద్యుత్ మీటర్లు, బల్బులు, ఫ్యాన్లు నిరూపయోగంగా ఉన్నాయి. విద్యుత్ లేక ఉక్కపోతతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు బయటే కూర్చుంటున్నారు. జిల్లాలో చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సమస్య వేధిస్తోంది. మరుగుదొడ్లలో నీరు లేక నిరూపయోగంగా మారాయి. సమీపంలో కుళాయిలు, చేతిపంపులపైనే ఆధారపడాల్సిన దుస్థితి. మధ్యాహ్నం భోజనం సమయంలో ఇళ్ల వద్ద నుంచి సీసాలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు కొందరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని అంగన్వాడీ సిబ్బంది, మహిళలు కోరుతున్నారు.