గెలుపు, ఓటమి, డ్రా... చెస్ ఆటలో ఈ 3 అంశాలు మాత్రమే ఆటగాళ్లు సాధించగలరు. ఇందులో డ్రా అనేది చాలా మంది ఎక్కువగా సాధిస్తుంటారు. అలాంటి సమయాలో పాయింట్ల పట్టికకు అనుగుణంగా సాధించేవారిని టోర్నీ విజేతలుగా ప్రకటిస్తారు. దీన్ని మార్చాలనే ఆలోచన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ అక్కతమ్ముళ్లకు వచ్చింది. 64 గళ్ల బోర్డుని చిన్నచిన్న మార్పులు చేసి వినూత్న ప్రయోగం చేశారు. ఆటలో కొత్త పావును ప్రవేశపెట్టారు. ఇందులో గెలుపు, ఓటమి తప్ప డ్రా అనే ప్రసక్తే లేకుండా చేశారు. దాని పేరే జిరాఫీ చెస్. ఇప్పటిదాకా ఈ క్రీడను ఐదు రాష్ట్రాల్లో ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆటపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
అసలేంటీ జిరాఫీ ఆట....?
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భాగ్యశ్రీ , సాయి కిరణ్ రెడ్డికి చిన్నతనం నుంచి చెస్ ఆటపట్ల ఎంతో ఆసక్తి. చిన్నతనంలోనే వీరు చాలా మందికి చెస్ నేర్పించారు. కానీ ఈ అక్క తమ్ముళ్ల మనసులో ఓ ఆలోచన తట్టింది. చెస్‌లో అప్పుడప్పుడు డ్రా అవుతుంది. కానీ డ్రాగా ముగిస్తే అందులో గొప్పతనం ఏముందని భావించారు. అన్ని ఆటల్లాగే... చెస్‌లో డ్రాకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి జిరాఫీ చెస్‌ను రూపొందించారు. ఇందులో గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. జిరాఫీ చెస్ బోర్డులో 68 గళ్ళు ఉంటాయి. అదనంగా జిరాఫీ పావులను చేర్చుతారు. జిరాఫీ పావులు ఎటైనా ఎగరగలవు, మిగిలిన పావులన్నీ సాధారణ చదరంగం వలే కదులుతాయి. కావున ఆడేవారిలో రాజీ తత్వం ఉండదు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఒకవేళ ఓడినా... తిరిగి గెలిచేందుకు ప్రయత్నించాలే తప్ప, రాజీ పడటం ఉండదు. ఈ ఆట క్రీడాకారునిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. రానున్న రోజుల్లో ఈ ఆటను ప్రతి ఒక్కరు ఆదరిస్తారని క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆటను విద్యాశాఖ అధికారి అనుమతితో జిల్లాలోని విద్యార్థులకు నేర్పిస్తానని కోచ్ పేర్కొన్నారు.
2014లో జిరాఫీ చెస్ ఆటను రూపొందించారు. ఇప్పటివరకు చెన్నై నగరంలో, విజయనగరంలోని బొబ్బిలిలో, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వందల సంఖ్యలో పోటీలు నిర్వహించారు. ఈ ఆట ఐదు రాష్ట్రాల్లో ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో జిరాఫీ చెస్‌ను దక్షిణ భారతంలో విస్తరిస్తామన్నారు. త్వరలో జాతీయ- అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తామని అక్క తమ్ముడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఆటలన్నీ ఇతర దేశాల వారే కనిపెట్టారు. కానీ జిరాఫీ చెస్‌ను ఏపీలో... అందులోనూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అక్క తమ్ముళ్లు కనిపెట్టడం గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ ఆటపై ప్రజలు ఎంత మేరకు మక్కువ చూపిస్తారో వేచి చూడాల్సిందే.