కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈ రోజు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. మంత్రికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి స్వాగతం పలికారు. రైల్వేకోడూరు నుండి చిట్వేల్కి పోయే ప్రధాన రహదారిపై దాదాపు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన హై లెవెల్ వంతెనను మంత్రి ప్రారంభించారు. అంతేకాకుండా రైల్వేకోడూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి రూ.60 వేల కోట్లకుపైగా భారం మోపినా.. అన్నింటినీ తట్టుకుని రాష్ట్రంలోని ప్రజలకు ఏ కష్టం రాకుండా నిత్యం ప్రజల కోసం కష్టపడుతున్నామన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికల వరకేనని.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా ముందుకు వెలుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉందని సకాలంలో వర్షాలు పడుతున్నాయని, దీనివలన రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు, రైతులకు అన్ని సంక్షేమ ఫలాలు అందేందుకు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా చూస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వలేక ప్రభుత్వం పై అభాండాలు వేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: