పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చామని..లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయామని కడప జిల్లా జమ్మలమడుగులోని వలసకూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సొంతూళ్లకు వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదని... అధికారులు స్పందించి తమను సొంత రాష్ట్రాలకు పంపించాలని జమ్మలమడుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో వివిధ రాష్ట్రాలకు చెందిన బాధితులు సుమారు 150 మంది పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ 112 ,ఒడిశా 10, పశ్చిమ బెంగాల్ 22, కర్ణాటక 14 , తెలంగాణ 3, జమ్ము కాశ్మీర్ చెందిన ముగ్గురు జమ్మలమడుగులో ఉన్నట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కొంతమంది జమ్మలమడుగు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. సుమారు 50 రోజులుగా అర్థాకలితో జీవిస్తున్నామని, ఇక తమ వల్ల కాదని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పంపించాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు దాల్ మిల్లు, వస్త్ర దుకాణాలు, ఐస్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇదీచూడండి.