కడప జిల్లాలో 2017 నవంబరులో అమల్లోకి వచ్చిన "లాక్డు హౌస్ మానిటరింగ్ సిస్టం" విధానంతో మీ ఇంటి రక్షణ తమ బాధ్యత అంటున్నారు పోలీసులు. ఎల్హెచ్ఎమ్ఎస్ యాప్ డౌన్‌లోడు చేసుకుని సంతోషంగా ఊరు వెళ్లండని భరోసా ఇస్తున్నారు. వారం నుంచి 20 రోజులపాటు ఊరికి వెళ్లాలనుకునేవారు పోలీసులను సంప్రదిస్తే... వారి ఇంట్లో ఎల్హెచ్ఎమ్ఎస్ కెమెరా అమర్చుతారు. సెన్సార్ ద్వారా పని చేసే ఈ కెమెరాను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానిస్తారు. గృహానికి సమీపంలో కొత్త వ్యక్తులెవరైనా సంచరిస్తే... క్షణాల్లో అలారం మోగుతుంది. అంతే ఆ వ్యక్తి ఎవరనేది క్షుణ్ణంగా కనిపిస్తుంది. పోలీసులు 3 నిమిషాల్లోనే ఆ ఇంటిని చుట్టుముట్టి ఆ వ్యక్తిని పట్టుకుంటారు. కొత్త విధానంతో దొంగతనాలు బాగా తగ్గాయని పోలీసులు చెబుతున్నారు. దీని సాయంతో 2 భారీ దొంగతనాలు ఛేదించామని తెలిపారు.
నిరంతరం పర్యవేక్షణ
ఉచితంగానే పోలీసులు ఈ కెమెరాలు అమర్చుతున్నారు. పోలీసు సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని... ఈ విధానంపై మరింత అవగాహన అవసరమంటున్నారు నగరవాసులు. ఊర్లకు వెళ్లే వారి ఇళ్లలో కెమెరాలు అమర్చడమే కాదు... రోజుకు 4సార్లు ఆ ఇంటికెళ్లి పోలీసులు పరిశీలిస్తారు. రోజూ తాళం వేసిన ఇళ్లు లెక్కపెట్టి... రాత్రింబవళ్లు ఆ గృహాలపై నిఘా పెడుతున్నారు.