అనంతపురం జిల్లాలో..
రాష్ట్రంలో సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ అనంతపురంలో వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. తెదేపా అసత్య ఆరోపణలు ఆపాలని నినాదాలు చేస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
కదిరి అంబేడ్కర్ కూడలిలో వైకాపా ఎస్సీ విభాగం అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని రంగాలలో ఎస్సీలు అభివృద్ధి చెందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పిస్తోందని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు.
గుంటూరు జిల్లాలో..
పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందకుండా... ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నతీరును వ్యతిరేకిస్తూ గుంటూరులో వైకాపా నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆరోపించారు.
ప్రకాశం జిల్లాలో..
ఒంగోలులో వైకాపా జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో హెచ్ ఎం కాలేజీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైకాపా నాయకులు నిరసన తెలిపారు. ఎస్సీలపై చంద్రబాబు వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని నాయకులు తెలిపారు.
కర్నూలు జిల్లాలో..
పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు అడ్డుకోవటం సరికాదని కర్నూలులో ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీలకు వైకాపా ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
కడప జిల్లాలో..
కడప జిల్లా రైల్వేకోడూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద సామాజిక వర్గాల వ్యతిరేకి చంద్రబాబు అంటూ అంబేడ్కర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఆకెపాటి అమర్నాథ రెడ్డి వినతిపత్రాన్ని సమర్పించారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కడపలో వైకాపా నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి చేతిలో ప్లకార్డులు పట్టుకుని తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి