చెత్త పన్నుపై ప్రజల నుంచి ఎదురైన ఎదురైన ప్రశ్నలివి. అధికారులు, సిబ్బంది పన్ను వసూలు చేసేందుకు వెళ్లగా.. జనం ససేమీరా అన్నారు. చెత్తపన్నుపై రాష్ట్రమంతా ఇదే స్థాయిలో వ్యతిరేకత ఉన్నా.. ఈ దృశ్యాలు స్వయానా సీఎం సొంత జిల్లాలోవే.
కడప నగరాన్ని నాలుగు జోన్ల కింద విభజించి.. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి నెలకు 90, మరికొన్ని కాలనీలకు 40 రూపాయల చొప్పున.. చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. నాలుగైదు రోజులకోసారి చెత్త సేకరణకు ఆటోలు వస్తున్నా.. పన్ను పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇంటింటా పన్ను వసూలుకు శనివారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో..సిబ్బందిపై జనం తిరగబడ్డారు. చెల్లింపులకు మహిళలు నిరాకరించడంతో.. చాలా కాలనీల్లో వాగ్వాదాలు జరిగాయి.
వైకాపా కార్పొరేటర్లు ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరమనుకుని అప్రమత్తమయ్యారు. చెత్తపన్ను వసూలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ..మేయర్ సురేష్ బాబు, కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా కోరారు. అధికారులు అవగాహన లోపంతో వ్యవహరించారని కార్పొరేటర్లు చెబుతున్నారు. చెత్తపన్ను అంశంపై వచ్చేనెల 4న సర్వసభ్య సమావేశంలో నిర్ణయించాలని కమిషనర్ అన్నట్లు కార్పొరేటర్లు తెలిపారు.