Kadapa Collector Inspected CM Jagan Tour Arrangements: సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: ఈ నెల 9, 10వ తేదీల్లో సొంత జిల్లా కడపలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan Kadapa District Tour) పర్యటించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు (Collector Vijaya Rama Raju) అధికారులను ఆదేశించారు. పులివెందుల, ఇడుపులపాయ ఎస్టేట్‌లో హెలిప్యాడ్, వైఎస్సార్ ఘాట్.. ప్రాంగణాలను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ (SP Siddharth Kaushal), జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్‌లతో కలిసి పరిశీలించారు.
పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన - ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
మొదటగా పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్, శ్రీకృష్ణ దేవాలయం, ఎపీ సీఏఆర్ఎల్ ఆవరణలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్స్, వ్యవసాయ, ఉద్యాన కళాశాల ప్రాంగణాలను కలెక్టర్ విజయ రామరాజు అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం శిల్పారామంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
అందులో ముఖ్యంగా సీఎం జగన్ ప్రారంభోత్సవం చేసే.. జిప్ లైన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం, మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్లను పరిశీలించారు. ఆ తర్వాత.. ఇడుపులపాయ ఎస్టేట్‌లో.. హెలిప్యాడ్, ముఖ్యమంత్రి బసచేసే గెస్ట్ హౌస్, నూతనంగా నిర్మితమైన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ భవనం, నెమళ్ల పార్కులో ప్రజా ప్రతినిధుల రివ్యూ మీటింగ్ సభా ఏర్పాట్లను ఎస్పీ, జేసీ, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
సీఎం పర్యటన కోసం స్కూళ్లకు సెలవా!- విద్యార్థి సంఘాల ఆగ్రహం
బాధ్యతగా విధులు నిర్వహించాలి: ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్న వారందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలని, అలాగే తాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: భద్రత, పార్కింగ్ అంశాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, పోలీసు, ఫైర్ అధికారులు, మున్సిపల్, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.