Janasena Varahi Yatra: జనసేన పార్టీ ప్రారంభించబోతున్న వారాహి యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసి పవన్ కల్యాణ్ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వైసీపీ విముక్తికి పవన్ కల్యాణ్ పాటుపడుతున్నారని ఆయన అన్నారు. కడపలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం వారాహి యాత్రకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ క్రమంలో మాట్లాడిన నాగేంద్ర.. కార్మిక, కర్షక, ఉద్యోగ, నిరుద్యోగ, వృద్ధులు, విశ్రాంతి ఉద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరిని వారాహి యాత్రలో కలిసి వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కడప జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్‌ను త్వరలో ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. కావున ఈ నెల 14న అన్నవరంలో ప్రారంభం కానున్న వారాహి యాత్రకు కడప జిల్లా నుంచి ప్రతి ఒక్క కార్యకర్త హాజరుకావాలని పేర్కొన్నారు.
దీంతోపాటు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏ అవకాశాలూ లేకుండా చేశారని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన అనుచరులు మాత్రమే లాభపడుతున్నారని ఆయన అన్నారు. సీఎం.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప.. మరే విధంగా ఆయనతో పోటీ పడలేరని అన్నారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ కూడా రిలీజ్ చేయలేదని ఆయన అన్నారు. ఇలా చాలా హామీలను సీఎం గాలికొదిలేశారని ఆయన అన్నారు. పైగా వైసీపీ నేతలు ప్రతి సమావేశంలో.. 98.5 శాతం హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. కాగా.. వాటిలో మిగిలిన 1.5 శాతం హామీలేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
"జనసేన పార్టీ ప్రారంభించబోతున్న వారాహి యాత్రలో కార్మిక, కర్షక, ఉద్యోగ, నిరుద్యోగ, వృద్ధులు, విశ్రాంతి ఉద్యోగులను కలిసి వారి సమస్యలను పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. అనంతరం వాటిని పరిష్కరించే దిశగా ఆయన ముందుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు జనసేన అధినేత పాటుపడుతున్నారు. సీఎం జగన్.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏ అవకాశాలూ లేకుండా చేశారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారు. అధికార పార్టీ నాయకులకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. ప్రతి సమావేశంలో 98.5 శాతం హామీలు నెరవేర్చామని చెప్తున్న వైసీపీ నేతలు.. వాటిలో మిగిలిన 1.5 శాతం హామీలేంటో చెప్పాలి" - తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి