కడపలో నిన్న రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి నగరమంతా నీట మునిగింది. రోడ్లు, వీధులు చెరువులను తలపించాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోకాలిలోతు వరకు వర్షం నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోహియానగర్లోని వీధులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. విద్యుత్ కార్యాలయంలోకి నీరు చేరడంతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
వరద నీటితో కుందూ నది ఉరకలెత్తుతోంది. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీటికి వరద నీరు తోడు కావటంతో నదిలో నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. రెండు రోజుల కిందట కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా శనివారం సాయంత్రానికి 20 వేల క్యూసెక్కులకు చేరుకుంది. ఈరోజు ఉదయం దాదాపు 25 వేల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు తెలిపారు. చాపాడు మండలంలోని సీతారామపురం వద్ద దిగువ వంతెనపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలోని చక్రాయపేట మండలంలో రాత్రి భారీ వర్షం కురవటంతో సిద్దారెడ్డిపల్లెలోని లోమడ రామంజల్రెడ్డికి చెందిన ఇళ్లు కూలిపోయింది. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి వరండాలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి కింద కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.
ప్రొద్దుటూరు పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. పొద్దుటూరు ఎర్రగుంట్ల మార్గమధ్యంలో మట్టికట్ట తెగిపోయే స్థితికి చేరింది. వరద నీటిలో భాజపా నేత బాల చంద్రారెడ్డి నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెన్నా నదికి చేరుకొని బాలచంద్రారెడ్డి ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి