ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోని పులివెందుల, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల పనుల కోసం రూ.412.51 కోట్లు కేటాయించారు. రాష్ట్ర గ్రామీణ రహదారుల ప్రాజెక్టు కింద 719.62 కి.మీ.పొడవైన 347 పనుల కోసం ఈ నిధులు వెచ్చించనున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్‌చీఫ్(ఈఎన్‌సీ) ప్రతిపాదనలను ఆమోదిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఉత్తర్వులనిచ్చారు.
పులివెందుల నియోజకవర్గంలోని 366.28 కి.మీ. పొడవైన 105 రహదారుల పనుల కోసం రూ.214.31 కోట్లు కేటాయించారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో 176.54 కి.మీ. పొడవైన 137 రహదారుల పనులకు రూ.99.96 కోట్లు మంజూరు చేశారు. ఇదే జిల్లాలోని తంబళ్లపల్లెలో రూ.98.24 కోట్ల అంచనాతో 176.80 కి.మీ. పొడవైన 105 పనులను ముఖ్య కార్యదర్శి ఆమోదించారు. 2019 అక్టోబరు 25న వీటికి పరిపాలన అనుమతులిచ్చినట్లు పేర్కొన్నారు. వివిధ ప్యాకేజీల కింద రివర్స్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిధులు కేటాయించినట్లు బుధవారం విడుదల చేసిన ఉత్తర్వులలో వివరించారు.
ఇదీ చదవండి: