కడప జిల్లా బద్వేలు మండలం వనంపుల గ్రామానికి చెందిన రైతు పల్లె కేశవ. 2019-20 సంవత్సరానికి గాను రైతు భరోసా కింద రూ. 13,500 ఈయన బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఈ ఏడాది పంట సాగు కోసం తన ఖాతాలో రైతు భరోసా జమయిందా లేదా అని ఇటీవల బ్యాంకుకు వెళ్లి పరిశీలించారు. జమ కాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆయన స్థానిక తహసీల్దారు వద్దకు వెళ్లి సంప్రదించారు. నీ భూమి ప్రభుత్వానికి చెందినదిగా నమోదైందని తహసీల్దారు బదులిచ్చారు. వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. రైతు వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని చెప్పారు. ఈ సమస్య ఈయన ఒక్కరిదేకాదు.
అప్పుడలా.. ఇప్పుడిలా ఎందుకు..?
జిల్లావ్యాప్తంగా 30 వేల మంది రైతులకు సంబంధించి భరోసా మొత్తం జమకాలేదని వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనికి రైతులు సాగు చేస్తున్న భూమి ప్రభుత్వానిదిగా చూపిస్తుండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బాధిత రైతులు గతేడాది జమైన నగదు ఈ ఏడాది ఎందుకు కాలేదంటూ బ్యాంకు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లాలో జూన్ నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగుకు సంబంధించి రైతులు ఇప్పుడే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అందించే రైతు భరోసాతో భూమిసాగు చేద్దామనుకునే రైతులు.. జమవ్వక ఆవేదన చెందుతున్నారు.
ఎక్కడికి వెళ్లాలి.. ఎవరినడగాలి..?
బ్యాంకుకు వెళ్లిన రైతులు... భరోసా నగదు జమ కాకపోవటంతో వెంటనే స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. వారు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆపై సంబంధిత అధికారుల వద్దకు వెళితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని అదంతా రెవెన్యూ కార్యాలయంలో చేయాల్సిన పని అంటూ వారు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
ఆందోళన అనవసరం
'అంతర్జాలంలో ప్రభుత్వ భూమి అని ఆన్‌లైన్‌లో నమోదైనా సంబంధిత రైతులకు భరోసా అందుతుంది. ఈ విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. గతేడాది ఆఫ్‌లైన్‌లో వ్యవసాయ అధికారులు రైతుల పేర్లను నమోదు చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఈ ఏడాది పక్కాగా రైతులందరి ఆధార్‌తోపాటు భూమిపత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం వారంరోజుల గడువు ఇచ్చింది. ఈలోగా ప్రభుత్వభూమి అని పేర్కొన్న రైతుల ఆధార్, భూమిపత్రాలకు అనుసంధానం చేసి వారికి నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటాం.'- ధర్మచంద్రారెడ్డి, ఆర్డీవో- రాజంపేట
ఇవీ చదవండి... 'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'