కడప జిల్లాలో అటవీ అధికారుల కూంబింగ్ నిర్వహించారు. ఖాజీపేట మండలం నాగసాయిపల్లె వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందటంతో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 50 మంది ఎర్రచందనం కూలీలు ఖాజీపేట నుంచి ప్రొద్దుటూరు వైపు లారీలో పారిపోతూ అధికారులకు తారసపడ్డారు. మైదుకూరు పట్టణ శివారులోని ఫ్లైఓవర్ వద్ద వారిని అదుపులోకి తీసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నించారు.
అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎర్రచందనం కూలీ వాహనంపై నుంచి దూకి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా..కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు తమిళ కూలీలను ప్రొద్దుటూరు అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ అధికారులపై కూలీలు చేసిన దాడిలో.. ఖాజీపేట సెక్షన్ ఆఫీసర్ గాయపడినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : student died by snake: కాటేసిన పాము.. కట్టుకట్టి నిద్రపుచ్చిన ఆయమ్మ