కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణం మీదుగా.. చెన్నై నుంచి 2 లారీల్లో సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలను కడప జిల్లా సరిహద్దు అయిన కుక్కలదొడ్డి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 131 మంది ఉత్తరప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. వీరిలో ఉన్నారు.
వీరందరూ చెన్నైలో వివిధ కంపెనీల్లో పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. కరోనా లాక్ డౌన్ తో వారికి పనులు లేక తినేదానికి తిండి లేక ఇబ్బందులు పడి.. ఆఖరికి సొంత రాష్ట్రాలకి బయలుదేరారు. ఈలోపే పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి రైల్వేకోడూరు పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. వారందరినీ రెండు, మూడు రోజుల్లో సొంత రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తహసీల్దార్ శిరీష తెలిపారు.
ఉత్తరప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్ వలస కూలీలు ఈటీవీ భారత్ తో మాట్లాడుతూ.. తమ సొంత ఖర్చులతో లారీల్లో పోతుంటే రైల్వేకోడూరు పోలీసులు అడ్డుకుని క్వారంటైన్లో ఉంచారని వాపోయారు. తమకు సరైన వసతులు కల్పించడం లేదన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు తమను పంపించాలని కోరారు.
ఇదీ చదవండి: