Mother Donates Organs His Son: తండ్రి గొడ్డలి వేటు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుమారుడు ప్రాణాలు కోల్పొగా, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా జరిగింది.
గొడ్డలితో దాడి.. పురుగుల మందు: నక్కలదిన్నె గ్రామానికి చెందిన బసిరెడ్డి నరసింహారెడ్డి ఈ నెల 13న సంక్రాంతి పండగ వేళ అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న కుమారుడు అభితేజరెడ్డి, కుమార్తె పావనిలపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో త్రీవంగా గాయపడిన అన్నాచెల్లిని బంధువులు కర్నూలు ఆసుప్రతికి తరలించారు. అభితేజరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గత శనివారం హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అభితేజరెడ్డి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా పావని కర్నూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే భర్త, కుమారుడు చనిపోవడంతో భార్య తులసమ్మ కన్నీరుమున్నీగా విలపించారు.
పదవ తరగతి: నక్కలదిన్నెకు చెందిన అన్నాచెల్లెళ్లు ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. అభితేజరెడ్డి చెల్లి పావనితో కలిసి గ్రామం నుంచి ప్రతిరోజూ పట్టణంలోని బడికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు. అభితేజరెడ్డి చిన్నతనం నుంచే శ్రద్దగా చదివేవాడు. పదవ తరగతి కావడంతో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో మరింత ఏకాగ్రత పెంచుకున్నాడు. ఇంతలోనే తండ్రి గొడ్డలి దాడిలో మృతి చెందడం తోటి స్నేహితులు, ఉపాధ్యాయులను కలచివేసింది.
అవయవాలు దానం: అభితేజరెడ్డి చనిపోయినా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో తల్లి తులసమ్మ అతని అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. హైదారాబాదుకు చెందిన ఆసుపత్రి వైద్యులు, జీవన్ దాన్ ట్రస్టు నిర్వాహకులు బాలుడి అవయవదానానికి మార్గం సుగుమం చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు చరవాణి ద్వారా విజ్ఞప్తి చేయడంతో ప్రొద్దుటూరు సీఐ యుగంధర్‌ను హైదరాబాదుకు పంపారు. పోలీసు పక్రియను పూర్తి చేసి మృతదేహాన్ని జీవన్‌దాన్ ట్రస్టుకు అప్పగించారు. దీంతో గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను సేకరించారు.
ఓ వైపు భర్త, మరో వైపు కుమారుడిని కోల్పోయి తులసమ్మ తీవ్ర దుఖంలో ఉన్నప్పటికీ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకోవడంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్, జీవన్ దాన్ ట్రస్టు నిర్వాహకులు, ఆసుపత్రి వైద్యులు అభినందించారు.
ఇవీ చదవండి