ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూసేకరణ చేపడుతోంది. కడప శివారులోని నానాపల్లి వద్ద ఉన్న 96 మంది రైతుల వద్ద 110 ఎకరాలను రెవెన్యూ అధికారులు తీసుకున్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసమని రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలాలను ఇచ్చారు. 5 నెలల క్రితం భూములిచ్చామని రైతులు చెబుతున్నారు. 15 రోజుల్లోనే డబ్బులను ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని వాపోతున్నారు.
ఒక్కో రైతు ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు భూములు ఇచ్చారు. ఎకరానికి 35 లక్షలు ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. పంట పొలాలను సాగు చేసుకోలేక... వారి ఖాతాల్లో డబ్బులు పడక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూసేకరణకు సంబంధించిన నివేదికలన్నింటిని రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించామని కడప తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని అన్నారు.
ప్రభుత్వానికి భూములిచ్చి తాము కష్టాలు పడుతున్నామని.... వెంటనే ప్రభుత్వం స్పందించి డబ్బులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.