Crop Insurance: పంటల బీమా మంజూరులో అర్హులకు అన్యాయం జరిగిందంటూ వైయస్‌ఆర్, ప్రకాశం జిల్లాల్లో రైతులు నిరసన తెలిపారు. వైయస్‌ఆర్ జిల్లా లింగాల మండలం అంబకపల్లె రైతులు శుక్రవారం ఇప్పట్ల గ్రామ సచివాలయం సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేసి ధర్నా చేశారు. ఎంపీఈవో తనకు అనుకూలమైనవారికి బీమా మంజూరుకు సహకరించారని, వ్యక్తిగత కక్షతో మరికొందరికి అన్యాయం చేశారని ఆరోపించారు.
ఉద్యాన అధికారి రాఘవేంద్రరెడ్డి, ఏవో రమేష్, తహసీల్దారు శేషారెడ్డి, ఎంపీడీవో సురేంద్రనాథ్ గ్రామానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. గ్రామంలో శనివారం పర్యటించి అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సచివాలయం తలుపులు తెరిచారు.
అసలైన వారిని పక్కనపెట్టి రాజకీయ వత్తాసు పలికిన అనర్హులకు బీమా సొమ్ము కట్టబెట్టారని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో రైతులు నిరసన తెలిపారు. పరిహారంలో అక్రమాలపై గురువారం ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు.. ఒంగోలు శిక్షణ కేంద్రం ఏడీఏ బాలాజీ నాయక్, మార్కాపురం ఉద్యాన అధికారి రవితేజ, స్థానిక ఏవో చంద్రశేఖర్‌లను శుక్రవారం తర్లుపాడు మండల కేంద్రానికి పంపించారు.
వారు అక్కడి ఆర్బీకేలో స్థానిక రైతులతో సమావేశం ఏర్పాటుచేసి పరిహారం పంపిణీ వ్యవహారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఉన్న రైతులు అధికారులను ఆర్బీకేలో ఉంచి తాళం వేసి నిర్బంధించారు. పరిహారం పంపిణీలో అత్యధికంగా సాగుచేసిన మిరపను విస్మరించడంపై మండిపడ్డారు. అధికారులు ప్రాధేయపడటంతో దాదాపు గంట తర్వాత విడుదల చేశారు.
ఇవీ చూడండి: