కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
వైఫల్యాలను ఎండగట్టేందుకే పోటీ..
వైకాపా అసమర్థత పాలనను, అన్యాయాన్ని ప్రశ్నించడానికే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. రాష్టంలో పరిపాలన రోజురోజుకీ దారుణంగా తయారువుతోందన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని..,శాంతి భద్రతలు క్షీణించాయని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామని..దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆగాలంటే..ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతోందన్నారు.
వైకాపా అభ్యర్థి నామినేషన్ దాఖలు
బద్వేలు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా వెంకటసబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
జనసేన, తెదేపా దూరం
బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశంలో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.
వారసత్వాలను ప్రోత్సహించం: భాజపా
బద్వేలు ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలను భాజపా ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణిస్తే.. ఆయన భార్య పోటీ చేసినంత మాత్రానా తప్పుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. కాగా..బద్వేలు ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది.
ఇదీ చదవండి
Badwel By-Poll: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బద్వేలులో పోటీ: శైలజానాథ్