కడప జిల్లాలో పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తికాగా.. రేపు ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మలమడుగులో...
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం అధికారులు అంతా సిద్ధం చేశారు. డివిజనల్ సభా భవనంలో ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.... 15 ఏకగ్రీవమయ్యాయి. కొండాపురం మండలంలో 48 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరుగనున్నది. ఎర్రగుంట్ల జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా... జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురంలో జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్బంగా ఎన్నికల సామాగ్రితో పాటు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు వెళ్లారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది. నియోజకవర్గంలోని 3 జడ్పీటీసీ, 25 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. చిట్వేలు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. రెండు ఏకగ్రీవమయ్యాయి. పది ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికవ్వనుంది. ఓబులవారిపల్లి మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానం అన్నీ ఏకగ్రీవమయ్యాయి. పుల్లంపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి.పెనగలూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 ఏకగ్రీవం కాగా.. ఐదు ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఓటింగ్ జరగనుంది. కోడూరు మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలకు 14 ఏకగ్రీవం కాగా.. 10 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని తరలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి.