Fish Andhra: వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ఏర్పాటుచేసిన ఆక్వాహబ్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మూతపడిన దుకాణం ద్వారాలను మంగళవారం తెరిచారు. చనిపోయిన చేపలను విక్రయానికి పెట్టి అభాసుపాలయ్యారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించడంతో పాటు.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ఆక్వాహబ్ ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో గతేడాది డిసెంబరు 24న దీన్ని ప్రారంభించారు.
చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండటం, చేపలు బాగా పెరగడంతో ఆక్వాహబ్‌కు పెద్దగా స్పందన రాలేదు. దీని నిర్వహణ భారంగా మారింది. చివరకు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేకపోయారు. దీంతో ఎస్పీడీసీఎల్ ఫిబ్రవరి 10న విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో వెంటనే ఆక్వాహబ్ మూతపడింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో నిర్వాహకులు మంగళవారం దుకాణాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ, ఇంకా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు.
స్థానికంగా ఉన్న పార్లపల్లె డ్యాంలో లభిస్తున్న చేపలను తీసుకొచ్చి విక్రయానికి ప్రదర్శించారు. ఎండ వేడికి చేపలు చనిపోయాయి. హబ్‌కు వినియోగదారులు ఎవరూ రాలేదు. పునరుద్ధరించిన తొలిరోజు ఇలా ముగిసింది.
రూపాయి కూడా చెల్లించలేదు.. ఆక్వాహబ్ ప్రారంభం నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించలేదు. వీరికి రాయితీలివ్వాలనే ఆదేశాల్లేవు. బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేశాం. బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లిస్తేనే సరఫరా పునరుద్ధరిస్తాం. - జగదీశ్వర్‌రెడ్డి, ఏఈ, ఎస్పీడీసీఎల్
ఇదీ చదవండి: