CPI PADAYATRA FOR STEEL PLANT: విభజన హామీల్లో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆక్షేపించారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద మూడేళ్ల కిందట సీఎం జగన్ ఉక్కు పరిశ్రమ కోసం వేసిన శిలాఫలకం వద్ద నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర చేపట్టారు. ఐదు రోజుల పాటు నిర్వహించే పాదయాత్రను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు.
రామకృష్ణ పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, జనసేన, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. జమ్మలమడుగు సమీపంలో మూడు చోట్ల ఉక్కు పరిశ్రమ కోసం నిర్మాణాలు చేపట్టినా.. ఒక్కటి కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొందని నారాయణ అన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణం పూర్తి చేయలేని ముఖ్యమంత్రి.. మళ్ళీ రెండు రాష్ట్రాలను కలుపుతానని మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకోసం ఈ సమైక్య మాటలు మాట్లాడుతున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎందుకు ఉక్కు పరిశ్రమ పూర్తి చేయడం లేదో.. కేంద్రాన్ని ఎందుకు నిధులు అడగడం లేదో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలన్నారు. చెడ్డవాడైన గాలి జనార్దన్ రెడ్డికే ఈ ఉక్కు పరిశ్రమ బాధ్యత అప్పగిస్తే.. అతనైనా దీన్ని పూర్తి చేస్తాడని గుర్తు చేశారు.
తన పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం అభినందనీయమని రామకృష్ణ అన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రలు జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందని రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం శిలాఫలకాలు.. హామీలకే పరిమితం అవుతున్నారు తప్పితే.. ఒకటి కూడా పూర్తి చేయడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
ఇవీ చదవండి: