కరోనా వైరస్ కాటుకు గురై ఒకే ఇంట్లో దంపతులు మృత్యువాత పడగా.. అనారోగ్యంతో అదే కుటుంబానికి చెందిన వృద్ధురాలు చనిపోయిన ఘటన కడప జిల్లా సిద్దవటం మండలంలోని లింగంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. అయిదు రోజుల కిందట భర్త చనిపోగా గురువారం రాత్రి భార్య కూడా మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు.
కడప జిల్లా సిద్దవటం మండలం లింగంపల్లె గ్రామానికి చెందిన జింక చంద్రబాబు (45) కడపలోని మిఠాయిల దుకాణంలో పనిచేసేవారు. రెండు వారాల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కడపలోని సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారం రోజుల తర్వాత ఈయన భార్య లక్ష్మీదేవికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈమె కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. వీరి తర్వాత ఇటీవల చంద్రబాబు తండ్రి చెండ్రాయుడు కరోనా సోకడంతో ఈయన కడపలోని సర్వజన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 19వ తేదీన ఆసుపత్రిలో మృతి చెందారు. ఈయన మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి రప్పించకుండా ఆసుపత్రి సిబ్బందికే అప్పజెప్పడంతో వారే అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన భార్య లక్ష్మీదేవి ఆరోగ్య పరిస్థితి సైతం విషమించడంతో గురువారం రాత్రి ఆమె ఆసుపత్రిలోనే మృత్యువాత పడ్డారు. బంధువులు ఈమె మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బందికే అప్పజెప్పారు. తల్లిదండ్రులిద్దరూ కరోనాతో మృతి చెందడంతో కుమార్తె దివ్య (16), కుమారుడు భగీరథ (11) కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన భార్య లక్షుమ్మ(60) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల ఏడో తేదీన మృతి చెందారు. ఇలా వారి కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో చంద్రబాబు పిల్లలు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దంపతులు మృతి చెందిన విషయాన్ని సర్వజన ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు