కడప జిల్లాలో సోమవారం మధ్యాహ్నం వరకు 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అసలే తమకు కరోనా వైరస్ సోకిందని బాధితులు విలవిలలాడుతుంటే.. సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యక్తులు పెడుతున్న పోస్టులు వీరి కుటుంబ సభ్యులందరినీ మానసికంగా కుంగదీస్తున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్ చెబుతున్నా.. ఇది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావట్లేదు.
సాధారణంగా కరోనా వ్యాధి నిర్ధరణ అయిన వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలను ఏ మాధ్యమంలోనూ ప్రచురించకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో మాత్రం కరోనా వచ్చిన వ్యక్తుల వివరాలు తెలిపేలా పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు పనిగట్టుకుని ఇలా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు
ఇటీవల ప్రొద్దుటూరులో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి ఉన్నట్లు తేలింది. బాధితుడితో పాటు కుటుంబసభ్యులను అంబులెన్స్‌లో తరలిస్తున్న వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటంతో అవి వైరల్‌గా మారాయి. బాధితులు ఇక్కట్ల పాలయ్యారు. చికిత్స పొందుతున్న ఆ బాధితుడు స్పందిస్తూ.. ‘కరోనా వచ్చిన దానికంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల వల్లే బాధ ఎక్కువగా ఉంది’ అంటూ వాపోయారు. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబసభ్యుడు ఒకరు ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీకి విన్నవించారు.
ఇక.. రౌడీషీట్
'కొవిడ్-19పై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం, అనవసర వివరాలు పెడితే వారిపై కఠిన చర్యలుంటాయి. అవసరమైతే రౌడీషీట్ తెరుస్తాం. ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదు. కరోనాను అడ్డుకోవడమనేది ఓ సామాజిక బాధ్యత. దాన్ని విస్మరించిన ఎవరైనా సరే.. శిక్షార్హులుగా మారుతారు.' - అన్బురాజన్, జిల్లా ఎస్పీ
ఇవీ చదవండి: