విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి.. వాటిలో ఉన్న రాగి వైరును ఎత్తుకెళ్లే నలుగురు దొంగలను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లిమర్రి మండలానికి చెందిన ఒంటేరు అంకాలు, నాగరాజు, చిన్న, నాగేశ్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 600 కిలోల కాపర్ వైరు, అచ్చులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటివరకు 91 ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లి.. వాటిలోని కాపర్ వైరును అపహరించారని ఎస్పీ తెలిపారు. ఒంటేరు అంకాలు అనే దొంగపై ఏకంగా 40 కేసులు, మిగిలిన ముగ్గురు నిందితులపై 10 కేసులు ఉన్నట్లు జిల్లా పోలీసు అధికారి పేర్కొన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లలో నిందితులపై కేసులు ఉన్నాయన్న ఎస్పీ.. 40 కేసులున్న అంకాలుపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... కంటైనర్ సీజ్