Constable Committed Suicide After Killing his Family: కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం హత్య, ఆత్మహత్య కేసుకు సంబంధించిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి.. ఇంట్లో నిద్రిస్తున్న భార్య మాధవి, కుమార్తెలు లాస్య, అభిజ్ఞను సర్వీసు రివాల్వర్‌తో వెంకటేశ్వర్లు కాల్చి చంపాడు. పెద్ద కుమార్తె కొన ఊపిరితో ఉండగా.. ఛాతిపై మరో రౌండ్ కాల్పులు జరిపాడు. ముగ్గురు చనిపోయిన తర్వాత తానూ కాల్చుకుని మృతి చెందాడు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. ఇంట్లో లభించిన ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్ల ఆధారంగా వెంకటేశ్వర్లు రెండో భార్యగా అనుమానిస్తున్న రమాదేవిని లోతుగా విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 26వ తేదీన 20 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని రమాదేవి పేరిట వెంకటేశ్వర్లు రాసిచ్చాడు. చనిపోయే రోజు జిల్లా ఎస్పీకి, స్టేట్‌బ్యాంకు మేనేజరుకు లేఖ రాశాడు. తన కుటుంబం అంతా చనిపోయిన తర్వాత వచ్చే ప్రయోజనాలు, అలవెన్సులు అన్నీ రెండో భార్య రమాదేవికి చెందాలని లేఖలో పేర్కొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ రాసిన లేఖ ఆధారంగా రమాదేవిని మూడు రోజులుగా డీఎస్పీ కార్యాలయంలో రహస్యంగా విచారిస్తున్నారు. రమాదేవి భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతుంది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారని రమాదేవి పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తానే దాదాపు 40 లక్షల రూపాయలకు పైగానే కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు అప్పు ఇచ్చానని చెప్పింది.
అది చెల్లించాలని అడిగితే భూమిని తనపేరిట రాసిచ్చాడని పోలీసులకు తెలియజేసింది. లక్షల రూపాయలు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడని.. వాటిలో భారీగా నష్టపోయినట్లు ఆమె పోలీసులకు వివరించింది. స్టేట్‌బ్యాంకులో రుణం.. పరిచయస్తుల వద్ద లక్షల రూపాయలు అప్పులు చేసి వారికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చినట్లు తెలిసింది. ఇవన్నీ తన మొదటి భార్య మాధవికి తెలియకుండా కప్పిపుచ్చాడని.. ఇటీవల ఈయన వ్యవహారం తెలిసి ఆమె గొడవపడినట్లు సమాచారం.
భారీగా అప్పులు చేయడం.. అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు తీవ్రమై.. వేరే గత్యంతరం లేని స్థితిలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని బలి తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబాన్ని బలితీసుకోవడంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. షేర్ మార్కెట్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి భారీగా నష్టాలు చవి చూసిన హెడ్ కానిస్టేబుల్.. స్థాయికి మించి అప్పులు చేసి మానసికంగా కుంగి పోయినట్లు పోలీసు విచారణలో తేలింది. దీనికితోడు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఆమెకు ఆస్తినంతా రాసి ఇవ్వడంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.