CM JAGAN FIRES ON CHANDRABABU : రాష్ట్రంలో అభివృద్ధి పనులు కనిపిస్తున్నా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహించారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తాము చేసే ప్రతి పనిలో నెగెటివ్ కోణాలే చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నినాదం.. 'వై నాట్ 175' అని సీఎం జగన్ తెలిపారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన భరోసాతోనే ముందుకెళ్తున్నామన్నారు.
"అందరూ ఆలోచించాలి. అప్పుడూ ఒకటే రాష్ట్రం ఒకటే బడ్జెట్.. మరి ఇప్పుడూ అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల తక్కువ. ఆ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల ఎక్కువ ఉన్నా.. ఇప్పటిలా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. మనకు ఓటు వేయలేని వాళ్లకీ అర్హత ఉన్నవారికి కూడా మంచి జరిగేలా చూస్తున్నాం"-సీఎం జగన్
టీడీపీ ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసిందని సీఎం జగన్ విమర్శించారు. అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ అని తెలిపారు. ఇప్పటిలా టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తలరాతలు మారుతున్నాయని పేర్కొన్నారు. తమ పాలనలో ఎక్కడా లంచాలు లేవని తెలిపారు. పులివెందులలో రూ.125 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: