Prodduturu political heat: సీఎం సొంత జిల్లా కడప వైకాపాలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొద్దుటూరులో కొన్నేళ్లుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మధ్య నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వైకాపా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ జన్మదినం ఈ నెల 16న కాగా ఆ సందర్భంగా ఆయన అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో పలు చోట్ల ప్లెక్సీలు కట్టారు. వాటిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫోటో లేదు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీరాములపేటలోని పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ఇంటి సమీపంలో ప్లెక్సీలు కడుతుండగా ఎమ్మెల్యే ఫోటో లేని ప్లెక్సీ ఇక్కడ కట్టొద్దంటూ మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి తనతో వాగ్వాదానికి దిగాడని ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్‌రెడ్డి చెప్పారు. అదే సమయంలో కౌన్సిలర్ లక్ష్మీదేవి, ఆమె భర్త సహా మరికొందరు తనపై దాడి చేశారంటూ రఘునాథ్‌రెడ్డి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే ఎమ్మెల్సీ అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైకాపా కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డి ఆరోపించారు.
తామెవరిపైనా దాడి చేయలేదని ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ కట్టొద్దని మాత్రమే చెప్పామని కౌన్సిలర్ లక్ష్మీదేవి చెప్పారు. ఘటన సమయంలోఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వచ్చి తనను తుపాకీతో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదం జరిగినప్పుడు తాను అక్కడ లేనన్న ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ తుపాకీతో బెదిరించారననే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరపాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతేడాది జూన్ 25న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌కు ఇంటర్నెట్ ఫోన్‌కాల్ చేసి చంపుతామని బెదిరించారు. ఊరు వదలి వెళ్లకపోతే నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. దానిపై అప్పట్లో వైకాపా అధిష్ఠానానికి, ప్రొద్దుటూరు డీఎస్పీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఆ కేసు తేలలేదు. ఇదంతా ఎమ్మెల్యే అనుచరులే చేశారని ప్రతిపక్షాలు ఆరోపించినా రాచమల్లు మాత్రం వాటిని కొట్టిపారేశారు. మరోవైపు తాజా వివాదంతో ఎమ్మెల్సీతో పాటు అన్ని రకాల ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి..