వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కోవెల శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. స్వామి వారు రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఒంటిమిట్ట వీధులన్ని కిటకిటలాడాయి. ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీ సమేతంగా రథాన్ని సందర్శించి పూజలు చేశారు. డిప్యూటీ ఈవోలు ఆర్.రమణ ప్రసాద్, విజయలక్ష్మి, ఈఈ సుమతి పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆక్రమణలో ఉన్న ఆలయాల మాన్యాలను స్వాధీనం చేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ తమ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల ఆస్తులు దురాక్రమణలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్నిచోట్ల న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తెలిపారు. ఆలయాలకు చెందిన ప్రతి సెంటును స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: vontimitta : వైభవంగా రామయ్య కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం