CBI Inquiry Viveka PA Krishna Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకాకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారించారు. సుమారు అయిదు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను ఎందుకు దాచిపెట్టాల్సివచ్చిందనే విషయం పైనే చాలా సేపు ప్రశ్నించినట్లు తెలిసింది. తనపై దాడి జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటనాస్థలిలో ముందుగా కృష్ణారెడ్డి చేతికే చిక్కింది.
ఉదయం దొరికిన ఆ లేఖను పోలీసులు అక్కడికి చేరుకోగానే పీఏ కృష్ణారెడ్డి వారికి ఇవ్వలేదు. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాన్ని దాచి ఉంచమని తనకు సూచించినట్లు కృష్ణారెడ్డి తర్వాత వెల్లడించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేశారన్న కారణంతో హత్య జరిగిన రోజే కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఈ లేఖ విషయమై కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. లేఖను ఎందుకు దాచారనే కోణంలో సీబీఐ దర్యాప్తు జరగడం లేదని.. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విచారిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. నాలుగు రోజుల క్రితమే సీబీఐ అధికారులు పులివెందులలో కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో కుటుంబసభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు పంపారు. దీంతో మంగళవారం కృష్ణారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.
వివేకా వాచ్మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత: వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, వివేకా ఇంటి కాపలాదారు రంగన్నను.. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అర్ధరాత్రి పులివెందుల పోలీసులు తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన రంగన్నను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ తరలించాలని వైద్యులు సూచించారు. పోలీస్ బందోబస్తు మధ్య రంగన్నను అర్ధరాత్రి ఆక్సిజన్ సాయంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ అంబులెన్సులో కడప, రాయచోటి, పీలేరు మీదుగా పోలీసులు రహస్యంగా తిరుపతికి తీసుకుని వచ్చారు.
స్విమ్స్ వైద్యులు రంగన్నను పరీక్షించి చికిత్సలు ప్రారంభించారు. రంగన్నతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ఆసుపత్రికి రాలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని సిబిఐ కి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని రెండేళ్ల కిందట జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సిఆర్పిసి 164 కింద రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఈ ప్రత్యక్ష సాక్షిని కాపాడుకోవడానికి సిబిఐ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం రంగన్నకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కేసు కీలక దశకు చేరిన వేళ రంగయ్య అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: