మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో 54వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్ధన్‌ను అధికారులు విచారిస్తున్నారు.
హైకోర్టులో సీబీఐ కౌంటర్
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును చట్ట నిబంధనల మేరకే నిర్వహిస్తున్నామని సీబీఐ..హైకోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేసింది. కీలక దశలో ఉన్న దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకునే పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని పేర్కొంది. పిటిషనర్లు సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్ పాత్రను హత్య కేసులో తోసిపుచ్చలేం అని తెలిపింది. సునీల్ యాదవ్‌కు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించాయని, వాటిని ప్రస్తుతం బయట పెట్టలేమని..ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని చెప్పింది. సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ వేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ వేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Viveka Murder Case: హత్యలో సునీల్, అతని సోదరుడి పాత్ర తోసిపుచ్చలేం: సీబీఐ