కడప-చిత్తూరు జాతీయ రహదారిలో కడప నుంచి రాయచోటికి వెళ్లే దారిలో 83 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే పై వంతెన నిర్మాణంలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడప-రాయచోటి రహదారిలో రైల్వే గేటు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వంతెన నిర్మాణం మంజూరు చేసింది. గత కొన్ని నెలలుగా పనులు వేగంగా సాగుతున్నాయి. మరో 20 రోజుల్లో పై వంతెన ప్రారంభించాలని అధికారులు భావించారు. అంతలోనే ఊటుకూరు వైపు 15 నుంచి 30 మీటర్ల వరకు వంతెన పైభాగం కుంగిపోయింది.
చిన్నపాటి వర్షానికే పైవంతెన ఇంటర్ లాకింగ్‌లు ఉబుకుతున్నాయని అధికారులు గుర్తించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వంతెన కుంగిపోయిన ప్రదేశంలో మట్టిని జే.సీ.బీ సాయంతో పక్కకు తొలగిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.
40 ఏళ్ల నుంచి రైల్వే పై వంతెన కోసం ఎదురుచూస్తున్న కడప వాసుల కల నెరవేరుతోందని సంబరపడేలోపు ఇలాంటి ఘటన జరగడం స్థానికులకు ఆగ్రహం కలిగించింది. ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు జరిగే సమయంలో వంతెన కూలితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: