కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి సుధ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆమె..తన పేరిట ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తన పేరిట కోటి 11 లక్షల 72 వేల 177 రూపాయల విలువ చేసే చరాస్థులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద లక్షా 62 వేల రూపాయలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. మిగిలినదంతా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో, సేవింగ్ ఖాతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 14 లక్షల విలువ చేసే 350 గ్రాముల బంగారం ఉండగా..ఒక మహీంద్రా కారు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన పేరిట రూ. 48 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో సుధ పొందుపరిచారు. గోపవరం, సీకేదిన్నె మండలాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లు వెల్లడించారు. కడప సమీపంలోని పక్కీరుపల్లెలో వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తెలిపారు.
అప్పులు లేవు..
బ్యాంకుల్లో గానీ, ఇతరుల వద్ద గానీ ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. వైద్య వృత్తిలో గైనకాలజిస్టుగా పని చేస్తున్నానని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సర ఆదాయం 6 లక్షల 21 వేల 720 రూపాయలుగా చూపించారు. తనపై ఎలాంటి నేరచరిత్ర లేకపోగా..ఎక్కడా కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. తన భర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతి చెందినట్లు అఫిడవిట్లో వెల్లడించారు.
ఇదీ చదవండి
Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్