కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండీ ఆఫీస్ ఎదురుగా ఏపీఎంసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న సామూహిక నిరాహార దీక్షలు వంద రోజులకు చేరాయి. జులై 27వ తేదీ నుంచి 2001-2008 సంవత్సరం మధ్యకాలంలో సర్వీస్‌లో ఉండి చనిపోయిన కార్మికుల పిల్లలు 26 మందికి ఉద్యోగాలు వెంటనే పర్మినెంట్ చేయాలని.. డేంజర్ జోన్ కింద ఇళ్లు కోల్పోయి పనిచేస్తున్న కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ సామూహిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
జులై 27వ తేదీ నుంచి నేటి వరకు 100 రోజులుగా సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నా ఏపీఎండీసీ యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఏపీఎంసీ వర్కర్స్ యూనియన్ పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఈ నెల పదవ తేదీన విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఏపీఎండీసీ గౌరవ అడ్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏపీఎండీసీ సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. పని చేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్, ట్రైనింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వంద రోజులుగా సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను ఏపీఎండీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు