APIIC IT SEZ LANDS : అది ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ. దానికి నగరానికి దూరంగా ఎక్కడ భూములు ఇచ్చినా సరిపోతుంది. కానీ, కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) కట్టబెట్టింది. పరిశ్రమకు కేటాయించిన భూముల చుట్టూ నివాస ప్రాంతాలే ఉన్నాయి. సింగపూర్ టౌన్‌షిప్, కేంద్రీయ విద్యాలయం, రామకృష్ణ మఠం, ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వం నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లాంటివి సుమారు అర కిలోమీటరు పరిధిలో చుట్టూ ఉన్నాయి. వాటిమధ్యలో పరిశ్రమ ఏర్పాటుకు భూములను కేటాయించటంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సంస్థకు ఐటీ సెజ్ భూములు
కడప నగరాన్ని అనుకుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో సీపీ బ్రౌన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ పేరిట ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిని (ఐటీ సెజ్) 2007లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికోసం 52.76 ఎకరాలను పుట్లంపల్లి గ్రామ పరిధిలోని 260, 261, 264, 266, 267/1, 267/2 సర్వే నంబర్లలో ఉన్న భూములను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఇందులో 0.31 ఎకరాలను సబ్‌స్టేషన్ ఏర్పాటుకు దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు ఏపీఐఐసీ గతంలో కేటాయించింది. ఇది పోను ఇంకా 52.45 ఎకరాల భూములను 8 ఐటీ పరిశ్రమలకు కేటాయించేలా ఏపీఐఐసీ డీటీఎల్‌పీ నెం 9716/110/07/ఎ ద్వారా లే అవుట్‌ను రూపొందించింది. ఈ మేరకు ప్రతిపాదనను కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఆమోదానికి పంపి.. ఐటీ సెజ్ కింద అప్పటి ప్రభుత్వం నోటిఫై చేసింది.
మూడో వంతు ధరకే...
దాదాపు ఈ సెజ్ భూములన్నింటినీ కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే సంస్థకు ఏపీఐఐసీ కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరా సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అంటే వాటి విలువ సుమారు రూ.150 కోట్లు అవుతుంది. ఈ భూములకు 2021 మార్చి 22న ప్లాట్ ధరను చదరపు కి.మీ. రూ.2,108 వంతున ఏపీఐఐసీ వీసీఎండీ ఫైల్ నెం-1337705 ద్వారా ఖరారు చేశారు. దీని ప్రకారం ఎకరా రూ.85.31 లక్షలు అవుతుంది. ఇవే భూములను ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ పరిశ్రమకు రూ.42.48 కోట్లకు కేటాయిస్తూ 2021 అక్టోబరు 21న ప్రొవిజినల్ అలాట్‌మెంట్ ఉత్తర్వులను ఏపీఐఐసీ జారీచేసింది.
ఎస్‌ఐపీసీ పరిధికి రాకుండా..
ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం.. పరిశ్రమల ఏర్పాటుకు 5 ఎకరాల్లోపు ప్లాట్ల కేటాయింపు ప్రతిపాదనలపై జిల్లా స్థాయిలోని పెట్టుబడులు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో కేటాయించకపోతే మాత్రమే ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని రాష్ట్రస్థాయి భూముల కేటాయింపు కమిటీ (ఎస్‌ఎల్‌ఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. 5 నుంచి 50 ఎకరాల వరకు ఉన్న కేటాయింపు ప్రతిపాదనలపై ఎస్‌ఎల్‌ఏసీ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ వీసీఎండీ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగితే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో చర్చించాలి. 50 ఎకరాలకు మించిన ప్రతిపాదనలు ఏవైనా సరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ), సీఎం ఛైర్మన్‌గా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్‌ఐపీబీ) నిర్ణయం తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు భూముల కేటాయింపు విషయంలో అధికారులు జాగ్రత్తపడ్డారు. దీనికోసం సెజ్‌కు ప్రతిపాదించిన భూముల్లో ఎస్‌పీడీసీఎల్‌కు కేటాయించిన 0.31 ఎకరాలు పోను మిగిలిన 52.45 ఎకరాల్లో షిరిడీ సాయి సంస్థకు పూర్తిగా కేటాయించకుండా.. 49.8 ఎకరాలను కేటాయిస్తూ ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌ను ఏపీఐఐసీ జారీచేసింది. ఈ సంస్థకు డైరెక్టర్‌గా నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి 11 ఏళ్లుగా వ్యవహరిస్తున్నారు. శరత్‌చంద్ర కొల్లా, వినోద్, విక్రం రవీంద్ర మామిడిపూడి, కనకధార శ్రీనివాసన్ గత రెండు మూడేళ్లలో డైరెక్టర్లుగా చేరారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయించిన ప్లాట్ విస్తీర్ణం పోను మిగిలిన 2.65 ఎకరాలను ఎస్‌పీడీసీఎల్‌కు కేటాయించాలని నిర్ణయించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.
ఒకే ఒక్క దరఖాస్తు
ఐటీ సెజ్ కింద నోటిఫై చేసిన తర్వాత.. దానికి మళ్లీ కేంద్రం నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు రావాలి. దీనికోసం విశాఖలోని ఐటీ సెజ్ నుంచి ప్రతిపాదన వెళ్లింది. దీని ప్రకారం 2020 నవంబరు 18న కేంద్రం నుంచి డీ నోటిఫై ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటినుంచి ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోటానికి కేటాయించే అధికారం ఏపీఐఐసీకి వస్తుంది. ఈ భూముల కేటాయింపు కోసం షిరిడీ సాయి సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఈ మేరకు ప్రతిపాదన పరిశీలించి లీజు ప్రాతిపదికన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌వోసీ) ఇచ్చామని ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు తెలిపారు. ఈ భూముల కోసం ఒకే సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఎక్కువ దరఖాస్తులు ఉంటే వేలం ద్వారా కేటాయించే వాళ్లమని పేర్కొన్నారు. ఐటీ సెజ్‌కు కేటాయించిన భూములను డీ నోటిఫై చేసి.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు కేటాయించినట్లు కడప ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి ‘ఈనాడు’కు తెలిపారు.
ఇదీ చదవండి