గాలేరు-నగరి రెండో దశ ప్యాకేజీ పనులపై.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సదస్సు నిర్వహించారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో.. ప్రముఖ సాగునీటి నిపుణులు తుంగా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, స్థానిక తెదేపా, సీపీఐ, సీపీఎం నేతలు, రైతు సంఘం నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కోడూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు అందిచడమే తమ లక్ష్యమని నేతలు తెలిపారు. దానిని సాధించడం కోసం దశల వారీ పోరాటానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
రైతుల దైన్యం...
అరటి, మామిడి, బొప్పాయి పండ్ల తోటలకు, మంగంపేట బెరైటీస్, ఎర్ర చందనానికి ప్రసిద్ధిగాంచిన కోడూరులో.. తగినంత వర్షపాతం లేక రైతులు అల్లాడిపోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై పెట్టుబడుల భారం పెరిగి.. అప్పులు తీర్చలేక, అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కోడూరు, రాజంపేటల్లో చెప్పుకోదగ్గ నీటిపారుదల ప్రాజెక్టులు ఒక్కటీ లేకపోవడం వల్ల.. రైతులు పూర్తిగా వర్షంపైనే ఆధారపడుతున్నారన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ఉన్నా.. ఆయకట్టుకు నీళ్లు అందే పరిస్థితి లేదని వివరించారు.
నీటి ఎద్దడి...
అధిక వర్షపాతం సమయంలో చెక్ డ్యాంలు, చెరువులు నింపుకునే వెసులుబాటు లేక రైతులు నష్టపోతున్నారని.. రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. 1,000 అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడటంలేదని తెలిపారు. ఈ ప్రాంతానికి గాలేరు-నగరి సుజల స్రవంతి రెండోదశ అంతర్భాగమని.. 6,7 ప్యాకేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పుల్లంపేట మండలంలోని పుల్లంగి ఏరు, ఓబులవారిపల్లె మండలంలోని పాములేరు, కోడూరు మండలం లోని గుండాలేరు, ముస్టేరులోకి నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తే.. ప్రతి చెరువు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే కాలువ పనులు పూర్తి చేసి.. నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బ్రహ్మంసాగర్ జలాశయానికి నీరు రాకుండా అధికారుల చర్యలు